ఒత్తిళ్లలో పొత్తిళ్లు!

 సిటీబ్యూరో: చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన నవజాత శిశువులు, ఇతర పిల్లలు ఒకరి తర్వాత మరొకరు కరోనా వైరస్‌తో ఐసోలేషన్‌ వార్డుల్లో చేరుతున్నారు. ఒకవైపు దగ్గు, జలుబు, జ్వరం, నిమోనియా వంటి అనారోగ్య సమస్యలు.. మరోవైపు తల్లిదండ్రులకు దూరంగా ఐసోలేషన్‌ వార్డులో మంచంపై ఒంటరిగా ఉండలేక గుక్కపట్టి ఏడుస్తున్నారు. వీరిని ఓదార్చడం వైద్య సిబ్బందికి పెద్ద సమస్యగా మారింది.  అంతేకాకుండా పెద్దలకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందులు కూడా వీరికి ఇచ్చే పరిస్థితి లేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం వైద్యులకు పెద్ద సవాల్‌గా మారింది. వీరిలో ఎవరికైనా వెంటిలేటర్‌ చికిత్సలు అవసరమైతే పరిస్థితి ఏమిటనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు.