భారత్‌ మెనూ ట్రంప్‌నకు నచ్చేనా?

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన కోసం భారత్‌ చాలానే ఏర్పాట్లు చేసింది. ఆయనకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే అందరూ ‘ట్రంప్‌.. భారత్‌ గురించి ఏం మాట్లాడుతారు... ఈ పర్యటనతో భారత్‌- అమెరికా సంబంధాలు ఎలా మెరుగుపడతాయి’ అని ఆలోచిస్తుంటే ట్రంప్‌ సిబ్బంది మాత్రం వేరే విషయం గురించి ఆలోచిస్తున్నారట. ట్రంప్‌ తన డైట్‌లో నాన్‌ వెజ్‌ బర్గర్‌లు, స్టీక్‌, మటన్‌ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో భారత్‌లో ట్రంప్‌ పర్యటించే 36 గంటల్లో ఆయన మెనూ మారనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్‌ కోసం వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయిస్తున్నారు. అయితే వాటిలో వెజ్‌ ఐటమ్స్‌ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వెజ్‌ బర్గర్‌లు, మల్టీగ్రెయిన్‌ రోటీ, సమోసా మొదలైనవి  ట్రంప్‌ కోసం ప్రత్యేకంగా చేయిస్తున్నారు. 



ఈ విషయంపై సంబంధించిన ట్రంప్‌ సిబ్బంది... అధ్యక్షుడి డైట్‌లో ఎప్పుడు వెజిటేరియన్‌ను చూడలేదని తెలిపారు. ఇండియా మెనూ విషయంలో ఆయన ఏం చేస్తారో చూడాలి అని పేర్కొన్నారు. ట్రంప్‌ ఎప్పుడూ తినే మెక్‌డొనాల్డ్‌లో కూడా బీఫ్‌ బర్గర్‌లు అందుబాటులో లేవని  తెలిపారు. ట్రంప్‌ ఇప్పటి వరకు ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా ఆయన కోసం స్టీక్‌ అందుబాటులో ఉంచుతారని, అది వీలుకాకపోతే మటన్‌ను మెనూలో జత చేరుస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీ మెనూ, ఆతిథ్యం ట్రంప్‌నకు నచ్చుతుందో లేదోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. కాగా మంగళవారం సాయంత్రం ట్రంప్‌ ప్రధాని మోదీతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో విందు ఆరగించనున్నారు. (ఇక్కడ చదవండి: మొతెరాలో ఇదొక కొత్త చరిత్ర : ప్రధాని మోదీ)